Home » » CBI INVESTIGATION ON JAGAN PROPERTIES

CBI INVESTIGATION ON JAGAN PROPERTIES

Wednesday, July 13, 2011 | 0 comments

సాక్షి భూతంపై.. సీబీ'ఐ'
జగన్ అక్రమ ఆస్తులపై నిగ్గు తేల్చండి!
రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో నివేదికివ్వండి
కేంద్ర దర్యాప్తు సంస్థకు హైకోర్టు ఆదేశం

అధికారులు, ప్రతివాదులు సహకరించాలి
నిరాకరిస్తే మాకు చెప్పండి
మా వద్ద ఉన్న ఆధారాలూ తీసుకోండి
జడ్జీల సూచన
జగన్ లాయర్ల అభ్యంతరాలకు నో
నిజం నిప్పులాంటిది. దాచేస్తే దాగదు. కాల్చుకునో చీల్చుకునో ఏనాటికైనా బయట పడి తీరుతుంది. ఇప్పుడదే జరగబోతోంది. తండ్రి అధికార పీఠమే అండగా, అచిర కాలంలోనే అపర కుబేరుడిగా మారిన యువ నేత జగన్ అసలు రంగు 'అధికారికంగా ఆవిష్కృతం' కాబోతోంది. అధికార, అంగ బలాల అండతో... అడ్డంగా, అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్న జగన్... నిలువునా పాతేస్తే చాలు; నికార్సైన నిజాలు బయటపడకుండా అదృశ్యమవుతాయని అహంభావించిన జగన్... చివరికి చట్టం ముందు బోనులో నిలబడక తప్పలేదు. ఉన్నత విలువల కోసం పోరాడే లక్షణం ఇంకా మిగిలి ఉన్న ఈ దేశంలో, ఉన్నత న్యాయస్థానం దెబ్బకు 'తీగ లాగే' ప్రక్రియ మొదలైంది.

డొంక కదలడం మాత్రమే మిగిలి ఉంది. పాపం పండే రోజు త్వరలోనే రానుంది. ఎంత దూరం వెళ్లినా వెంటాడే న్యాయం గొంతుక, ఎంతో పొడవైన చట్టం చెయ్యి, వైఎస్ కుటుంబ పాత పాపాల కూపాలను తవ్వి తీయబోతోంది. వైఎస్ కుటుంబ అవినీతిపై, అడ్డగోలుతనంపై వరుస కథనాలు ప్రచురించిన 'ఆంధ్రజ్యోతి' ఒంటరి పోరాటానికి తాజా పరిణామాలతో తొలి సాధికారత లభించినట్టైంది.


కొసమెరుపు: వైఎస్ తాను అధికారంలో ఉన్నప్పుడు, ఎవరేదైనా ఆరోపణ చేస్తే చాలు... 'సీబీఐ విచారణకు సిద్ధం' అని తొడగొట్టేవారు! తన కొడుకు జగన్‌పైనే ఆయన పరిటాల హత్య కేసులో సీబీఐ విచారణ జరిపించుకున్నారు. కానీ అదే వైఎస్ కుమారుడు జగన్ మాత్రం... అక్రమాస్తుల ఆరోపణపై సీబీఐ విచారణకు ససేమిరా అన్నారు. ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంత తేడా! ఎందుకీ తేడా!!

కావాలంటే వారం రోజుల పాటు మీ (జగన్ లాయర్ల) వాదనలు వింటాం. అయితే... ముందుగా కేసు రిజిస్టర్‌చేసి విచారణ చేయాలని ఆదేశిస్తాం. మేము ప్రాథమిక విచారణకు మాత్రమే ఆదేశిస్తున్నాం. ఇంటరాగేషన్ చేయాలనో, దర్యాప్తు చేయాలనో ఆదేశించడం లేదు. ఇక్కడ ప్రజల ఆస్తులతో ముడి పడిన అంశాలు ఉన్నాయి. కనీసం ఏది ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక విచారణకు ఎందుకు అభ్యంతరం చెబుతారు?


'ప్రాథమికం'గా ఎప్పుడో తేలిపోయింది!

ఎలా సాధ్యం?
తండ్రి అధికారంలోకి రాకముందు జగన్ సంవత్సర ఆదాయం రూ.9.19 లక్షలు. 2009లో అదే జగన్ ఆస్తుల విలువ రూ.77.40 కోట్లు. 2011లో ఆస్తుల విలువ రూ. 445 కోట్లకు పెరిగింది. ఇవన్నీ జగన్ ఐటీ రిటర్న్స్, అఫిడవిట్‌ల రూపంలో స్వయంగా అంగీకరించిన విషయాలు. అంతా సక్రమమే అయితే, ఇంత స్వల్పకాలంలో, ఇంత భారీ 'అభివృద్ధి' ఎలా సాధ్యం?

ఎలా వచ్చాయి?
జగతి పబ్లికేషన్స్‌లో జగన్ పెట్టిన పెట్టుబడి రూ.73 కోట్లు. ఇందులో ఆయన వాటా 90 శాతం. ఇదే సంస్థలో వివిధ కంపెనీలు పదిశాతం వాటాకు పెట్టిన పెట్టుబడి సుమారు రూ.300 కోట్లు. ఆ కంపెనీలన్నీ వైఎస్ హయాంలో రకరకాలుగా లబ్ధి పొందినవే. అవినీతి సొమ్మును ఇలా పెట్టుబడి రూపంలో దారి మళ్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. జగతి సంస్థలో రూ. 15 కోట్లు పెట్టుబడి పెట్టిన 8 కంపెనీలు అసలు ఉనికిలోనే లేవని తేల్చి చెప్పింది.

ఇలా ఎంత సొమ్ము?
జగతి పబ్లికేషన్స్‌లో 'లెక్క తేలని' డబ్బు ఉన్నట్లు ఐటీ నిర్ధారించింది. ఈ మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తూ... రూ.122 కోట్ల పన్ను చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్, జూలై 12 : కడప ఎంపీ వైఎస్ జగన్ గుట్టలుగా పోగేసుకున్న ఆస్తులు, 'సాక్షి'లోకి వరదలా ప్రవహించిన పెట్టుబడుల మీద వెల్లువెత్తిన ఆరోపణలపై రాష్ట్ర హైకోర్టు సీబీఐతో ప్రాథమిక విచారణకు ఆదేశించింది. అక్రమాల అంతు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. జగన్ అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన మూడు పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్లు చేసిన అభియోగాలపైన, ప్రతివాదులందరిపైన ప్రాథమిక విచారణ జరిపి, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రు, జస్టిస్ విలాస్ వి. అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్ లేదా ఆయన నియమించిన అధికారి ఈ దర్యాప్తు చేసి, నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సూచించింది. హైకోర్టు వద్ద ఇప్పటికే ఉన్న పత్రాలను కూడా సీబీఐకి అందిస్తామని తెలిపింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లు, వాటి అనుబంధ పిటిషన్ల ప్రతులను హైకోర్టు రిజిస్ట్రార్‌ను నుంచి పొందాలని సీబీఐకి సూచింది. విచారణకు ప్రతివాదులు, సంబంధిత అధికారులు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది.

"విచారణకు అందరూ సహకరించాలి. ఎవరైనా సహాయ నిరాకరణ చేసినట్లయితే, మా దృష్టికి తీసుకురండి. ప్రాథమిక విచారణ నివేదిక ప్రతిని సీల్డు కవరులో ఉంచి రెండు వారాల్లోగా కోర్టు అందించండి'' అని సీబీఐని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తులు, సాక్షి మీడియాలో పెట్టుబడులపై విచారణ కోరుతూ మంత్రి పి. శంకరరావు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇదే అంశాలపై తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సంయుక్తంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన న్యాయవాది కేకే షేర్వాణి మరో పిటిషన్ వేశారు. ఈ మూడు పిటిషన్లను డివిజన్ బెంచ్ విచారణకు చేపట్టింది.

అంతకుముందు... సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడంపై జగన్ తరఫు న్యాయవాదులు సోమవారం తమ వాదనలు వినిపించారు. మంగళవారం ఈ వాదనలను కొనసాగించారు. జగన్, సాక్షి మీడియా తరఫున సుప్రీం కోర్టు నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ పిటిషన్ల విచారణార్హతపై వాదనలు మొదలు పెట్టారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. "విచారణార్హత అంశం ఎప్పుడో పూర్తయింది. ప్రాథమిక విచారణకు ఆదేశిస్తామని ఏప్రిల్‌లోనే స్పష్టం చేశాం'' అని గుర్తు చేసింది. ఆ తర్వాత వాదనలు ఇలా కొనసాగాయి...

ద్వివేదీ: మా వాదనలు వినడానికి మరో అవకాశం ఇవ్వకుండా సీబీఐ చేత ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశిస్తే మా సంస్థలపై ఉన్న సదభిప్రాయం పోతుంది. ఇన్వెస్టర్లు గందరగోళానికి గురవుతారు. (దీనికి సంబంధించి వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించారు.)

జస్టిస్ కక్రు: నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సీబీఐని కోరతాం. అందులో ఏముందో ఎవరికీ తెలిసే అవకాశం లేదు.

ద్వివేదీ: ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదైనా సంస్థపై లేదా గౌరవప్రదమైన వ్యక్తిపై చేసిన ఫిర్యాదులపై ప్రాథమిక విచారణకు ఆదేశించడం తగదు. అవినీతి నిరోధక చట్టం, సెబీ, ఫెమా, మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినట్లు పిటిషనర్లు ఆరోపించారు.

వాటిపై దర్యాప్తు చేయడానికి ఆయా చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ రాజ్యాంగానికి లోబడి రూపొందించినవే. మనదేశంలో విచారణ సంస్థలు రాజకీయ పార్టీల కనుసన్నల్లో ఉంటాయి. ఈ పిటిషన్లే రాజకీయ దురుద్దేశంతో కూడినవి. మా సంస్థల్లో పెట్టుబడులను 2జీ స్కాంతో పోల్చడం సరికాదు. అక్కడ అధికారంలో ఉన్న వ్యక్తులే భారత ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఇక్కడ అటువంటి శక్తులు లేవు. మా వాదనలు పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు ఇవ్వండి.

ధర్మాసనం: ఇవికాక ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? (మరో సీనియర్ న్యాయవాది రామక్రిష్ణారెడ్డి కలుగ చేసుకున్నారు)

రామకృష్ణా: ఈ పిటిషన్‌లో మా క్లైంటు 33వ ప్రతివాదిగా ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తు పేరిట మా సంస్థలపైనా దాడులు చేయవచ్చు.

జస్టిస్ కక్రు: అవన్నీ వదిలి పెట్టండి. మీపై కేసు నమోదయితే, దానిపైనా విచారణ జరిపే రోజు వస్తుంది. (ఒకింత ఆగ్రహంతో..)
(మరో సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ లేచి సీబీఐ ప్రాథమిక విచారణ పట్ల అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు)

జస్టిస్ కక్రు: ఇప్పటిదాకా చేసిన వాదనలు పునరావృతం కాకుండా, కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి.
(అయినప్పటికీ న్యాయవాది మళ్లీ అవే విషయాలు చెప్పడం మొదలు పెట్టారు. దీంతో ధర్మాసనం కలుగజేసుకుంది.)

ధర్మాసనం: ఈ కేసులోని అంశాలపట్ల మేం సంతృప్తి చెందాం. ఆ తర్వాతే సీబీఐచేత ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించాం.
(ఆ తర్వాత కూడా వేదుల వెంకటరమణ తన వాదనలు కొనసాగించాలని చూశారు.)

జస్టిస్ కక్రు: (కొంచెం ఆగ్రహంగా..) భోజన విరామం తర్వాతే కాదు! కావాలంటే వారం రోజుల పాటు మీ వాదనలు వింటా. అయితే... ముందుగా కేసు రిజిస్టర్‌చేసి విచారణ చేయాలని ఆదేశిస్తాం. మేము ప్రాథమిక విచారణకు మాత్రమే ఆదేశిస్తున్నాం. ఇంటరాగేషన్ చేయాలనో, దర్యాప్తు చేయాలనో ఆదేశించడం లేదు. ఇక్కడ ప్రజల ఆస్తులతో ముడి పడిన అంశాలు ఉన్నాయి. కనీసం ఏది ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక విచారణకు ఎందుకు అభ్యంతరం చెబుతారు?
(దీంతో జగన్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు ముగిసినట్లు స్పష్టం చేశారు)

ప్రతివాదులు వీరే...
అధికార ప్రతివాదులు: పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, విజిలెన్స్ డైరెక్టర్.

ప్రతివాదులు: ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ (భారతి సిమెంట్స్), పెన్నా సిమెంట్స్ గ్రూప్, ల్యాంకో గ్రూపు, సజ్జల గ్రూపు, బి. పురుషోత్తమ నాయుడు, సందేశ్ ల్యాబ్స్, పీబీపీ బిజినెస్ వెంచర్స్, క్యూబాయిడ్ రియల్టర్స్, మ్యాన్‌ట్లే రియల్టర్స్, మెటాఫర్ రియల్ ఎస్టేట్స్, పీవీపీ బిజినెస్ టవర్స్, జీ2 కార్పొరేట్ సర్వీసెస్, సుగుణి కన్‌స్ట్రక్షన్స్, ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా అవెన్యూస్, గిల్ క్రిస్ట్ ఇన్‌వ్వెస్ట్‌మెంట్స్, ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్, క్యారమెల్ ఆస్రా హోల్డింగ్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, భగవత్ సన్నిధి ఎస్టేట్స్, క్లాసిక్ రియల్టీ, భారతి సిమెంట్స్, సిలికాన్ బిల్డర్స్, కేప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, పులివెందుల పాలిమర్స్, హరీష్ ఇన్‌ఫ్రా, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, కంటి కండక్టర్స్, స్వగృహ హోటల్స్, జూబ్లీ మీడియా, ఈఆర్ఈఎస్ ప్రాజెక్ట్స్, ఎం. శ్రీనివాసరెడ్డి, జి. శ్రీనివాసరాజు, ఎ.కె. దండమూడి, కె. శ్రీనివాస నాయుడు, అజయ్ గారపాటి, మాదవ్ రామచంద్రన్, జి. అనంతసేనా రెడ్డి, కె. ప్రసాద్ రెడ్డి, డి. సరోజనమ్మ, డి. శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

Share this article :

0 comments:

Post a Comment

 
| |
Copyright © 2011. Sarath The king - All Rights Reserved
Template Designed by Sarath